ఐపీఎల్ మాయలో మునిగిపోయిన రింకూ సింగ్ జీవితం!
ఐపీఎల్ మాయలో మునిగిపోయి, ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం ఒక సీజన్లోనే అతని ధర రూ.55 లక్షల నుంచి రూ.13 కోట్లకు పెరిగింది. ఈ మార్పుతో రింకూ సింగ్ కొత్త ఇంటి యజమానిగా మారారు. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ అక్టోబర్ 31న రిటెన్షన్ జాబితాలో రింకూ సింగ్ని చేర్చుకున్న తర్వాత అతని జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అతనికి చెల్లించిన భారీ మొత్తంతో రింకూ అలీఘడ్ లోని ఓజోన్ సిటీ గోల్డెన్ ఎస్టేట్లో దాదాపు 500 చదరపు గజాల విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసారు. ఈ ఇంటి ధర రూ. 3.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
రింకూ సింగ్ కుటుంబంతో కలిసి కొత్త ఇంటిలోకి ప్రవేశించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. గోల్డెన్ ఎస్టేట్ ఆఫ్ ఓజోన్ సిటీలోని ఇంటి నెంబరు 38లో ఇకపై రింకూ సింగ్ ఉండనున్నారు.
రింకూ సింగ్ కుటుంబం పేదరికం నుంచి వచ్చింది. తన కుటుంబానికి పెద్ద బంగ్లాను కొనుగోలు చేయాలనే కల ఉండేదని రింకూ సింగ్ చెబుతున్నారు. ఐపీఎల్ లో అతని సంపాదన ఏటా పెరుగుతూనే ఉంది.
* 2017 – రూ.10 లక్షలు
* 2018 – రూ.80 లక్షలు
* 2019 – రూ.80 లక్షలు
* 2020 – రూ.80 లక్షలు
* 2021 – రూ.80 లక్షలు
* 2022 – రూ.55 లక్షలు
* 2023 – రూ.55 లక్షలు
* 2024- రూ.55 లక్షలు
* 2025 – రూ.13 కోట్లు
2017 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న రింకూ సింగ్ ఇప్పటి వరకు 45 మ్యాచ్లు ఆడి 893 పరుగులు చేశారు. నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టారు. అతని స్ట్రైక్ రేటు 143.34గా ఉంది. 2023 సీజన్ లో ఒకే ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో ఐదు సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా రింకూ సింగ్ ఎదిగారు. అతను టాప్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. డెత్ ఓవర్లలో అతని ఫినిషింగ్ కు అసాధారణ రికార్డు ఉంది.