శబరిమలలో వర్షాల తాండవం
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలోని శబరిమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ప్రారంభమైన ఈ వర్షం ఆదివారం ఉదయం పతనంతిట్ట జిల్లాలో ఎడతెగని వర్షంగా మారింది. అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంబా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద నివారణకు అన్ని చర్యలు చేపట్టారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం నది ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా భక్తులను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నదులు, అడవుల్లోకి భక్తులను అనుమతించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఘాట్లలో స్నానాలు చేయకూడదని హెచ్చరించారు. వర్షాలు తగ్గి, నదుల్లో నీటి ప్రవాహం సాధారణ స్థితికి చేరే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పతనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు.
పర్వత ప్రాంతాలు, అడవుల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, నదులు దాటడం, స్నానాలు చేయడం పూర్తిగా నిషేధించారు. ముక్కుజి-సత్రం అటవీ మార్గం గుండా ప్రయాణాన్ని నిషేధిస్తూ ఇడుక్కి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. పోలీసులు, అటవీ శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐఎండీ అంచనాల ప్రకారం డిసెంబరు 4 వరకు కేరళలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. వర్షాల కారణంగా అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.