కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మాజీ ఎంపీ
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, కాంగ్రెస్‌పై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా, కాంగ్రెస్ పార్టీ తనను చిత్రహింసలకు గురి చేసిందని ఆమె ఆరోపించారు. మెదడులో వాపు, దృష్టి తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు, స్టెరాయిడ్స్ మరియు న్యూరో డ్రగ్స్ వల్ల తన శరీరమంతా వాపునకు గురవుతున్నట్లు సాధ్వి ప్రజ్ఞా తెలిపారు. అయితే, తాను బతికి ఉన్నంతకాలం న్యాయపోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఆమె షేర్ చేసిన ఫొటోలో ఆమె ముఖంపై వాపు కనిపిస్తోంది.
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా, వైద్య చికిత్స పేరుతో గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఆమెకు బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. తుది వాదనలు కొనసాగుతుండగా, కోర్టు సాధ్వి ప్రజ్ఞా హాజరు కావాలని ఆదేశించింది.
ఇటీవల, హిందూయేతర వ్యాపారులు తమ వ్యాపార సంస్థలపై తమ పేర్లను రాయాలని సాధ్వి ప్రజ్ఞా డిమాండ్ చేశారు. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల దుకాణాలపై పేర్లు రాసి ఉంచాలని ఆమె కోరారు. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో, దుకాణదారులు తమ పేర్లు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలపై స్పందించిన సుప్రీంకోర్టు, ఆ రెండు రాష్ట్రాల ఆదేశాలపై స్టే ఇచ్చింది.