మాదిగల పోరాటం: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం యుద్ధం
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాదిగలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఖైరతాబాద్ లోని మోడ్రన్ ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగిన హైదరాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ సదస్సులో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సదస్సుకు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు టి.వి. నరసింహ మాదిగ అధ్యక్షత వహించారు.
మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ మాలల ఆధిపత్యం నడుస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డికి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉన్నా, పార్టీలోని కొందరు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అమలుపరచడానికి మాదిగలు మళ్ళీ పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, నగరంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.