పవార్‌కు సుప్రీం కొరడా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సుప్రీం కోర్టు నుంచి నిరాశ ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ చిత్రాలను, వీడియోలను ఉపయోగించకూడదని సుప్రీం ఆదేశించింది. అంతేకాకుండా, అజిత్ పవార్ సొంత కాళ్ల మీద నిలబడడం నేర్చుకోవాలని చురకలు వేసింది. గతేడాది, ఎన్సీపీ నుంచి చీలిపోయి, మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా-శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. ఈ విషయం కారణంగా, పార్టీ రెండుగా చీలిపోయి, అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ పవార్ దృశ్యాలను వాడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో, సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.