సోషల్ మీడియా దుష్ప్రచారంపై సీఎం సీరియస్: కడప ఎస్పీ బదిలీ

కడప జిల్లాలోని కూటమి నేతలపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మరియు హోంమంత్రి అనిత ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఈ దుష్ప్రచారానికి కారణం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి కడప పోలీసుల అదుపులో లేకపోవడమేనని తెలుస్తోంది.

వైసీపీ యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పులివెందులలోని చిన్నచౌకు పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఉంచిన అతడిని పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు కడపకు వచ్చి రవీందర్ రెడ్డిని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే తాలూకా పోలీసులు అతడిని 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేశారని చెప్పారు. దీంతో రాజంపేట పోలీసులు బయటకు వెళ్లి గాలించగా అప్పటికే రవీందర్ రెడ్డి పరారైపోయాడని తెలుస్తోంది.

రవీందర్ రెడ్డి స్నేహితుడు మహేశ్వరెడ్డిని కూడా పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. వేముల వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతడిని పోలీసులు కొట్టి వాహనంలో ఎక్కించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కడపకు పంపింది. డీఐజీ కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమై రవీందర్ రెడ్డి గురించి విచారణ చేస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప ఎస్పీని బదిలీ చేసే ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. కడప జిల్లాలోని మరో సీఐని కూడా సర్కార్ సస్పెండ్ చేసింది. వైసీపీ నేత వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పీఏగా రవీంద్రారెడ్డి ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. రవీంద్రారెడ్డి పోస్టులపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ఏపీ క్యాబినెట్‌లో సీఎం దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *