సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న దురుసు ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు. వైసీపీ నేతలు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై నిరంతరం నిందలు, దూషణలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
“వైసీపీ నేతల ప్రవర్తన తీవ్రంగా ఉంది. వారి దుర్వినియోగంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని” పవన్ కల్యాణ్ విమర్శించారు. “తమ పార్టీ నేతల పై వ్యక్తిగత దాడులు, ఇంట్లో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినా పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు. ఎస్పీలకు ఫోన్ చేస్తే కూడా స్పందన లేదు. డీఎస్పీలు, సీఐలు ఎవరిపైనో నెపం నెట్టి తప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు న్యాయం లభిస్తుందా?” అని ఆయన ప్రశ్నించారు.