ఆడబిడ్డలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవు: చంద్రబాబు హెచ్చరిక
అమరావతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో అవసరమైన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
“ప్రజాస్వామ్యం పేరుతో నేరాలు చేస్తున్నారు. తమ ఆస్తులు దోచుకుంటున్నారు. ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. దీనికి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని హెచ్చరిస్తున్నాను.” అని చంద్రబాబు పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి అనిత, మరికొంతమంది ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బిడ్డలపై కూడా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని గుర్తుచేశారు. “తన గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. బాంబులకు కూడా భయపడను కానీ అలాంటి దుర్మార్గాలకు భయపడతాను.” అని చంద్రబాబు వివరించారు.
చంద్రబాబు, తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. “మేము రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశాము. సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి కృషి చేశాము. 2019 తర్వాత విద్యుత్ వ్యవస్థ దిగజారిపోయింది. కేంద్రం నిధులను దుర్వినియోగం చేశారు. పీపీఏలను రద్దు చేసి విద్యుత్ విధ్వంసం సృష్టించారు.” అని చంద్రబాబు ఆరోపించారు.
వైకాపా నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లు నేరస్థులుగా మారారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
“దేశం, ప్రపంచం లోని చట్టాలను అధ్యయనం చేస్తాను. ఆడబిడ్డలను ఇబ్బంది పెడుతున్న వారిని క్షమించేది లేదు. భావ స్వేచ్ఛ అంటే అసభ్యంగా ప్రవర్తించడమా? అసభ్య పోస్టులు పెట్టడమా? ఏ చట్టం ఈ హక్కును మీకు ఇచ్చింది?” అని చంద్రబాబు ప్రశ్నించారు.