సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు
సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టుల వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లా నకరేకల్కు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీసులోనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై, ప్రభుత్వ నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లను పోలీసులు రోజూ అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నారు.
ఈరోజు ఉదయం రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గుంటూరు జిల్లా సబ్ జైలులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నకిరేకల్కు చెందిన రాజశేఖర్ రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని, దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉన్నపుడు తీసుకువెళ్లాలని అంబటి పేర్కొన్నారు.
అదే రోజు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు, గతంలో జడ్జిలపై సోషల్ మీడియాలో కామెంట్లు చేసినందుకు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో పలువురిని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మున్ముందు మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వారి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతీ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు మద్దిపాడు పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ పోస్టింగ్స్ పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్‌లో పోస్టు చేశారని ఫిర్యాదు నమోదు అయ్యింది. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు మూడు రోజులు క్రితమే రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు.