తిరుమల తిరుపతి దేవస్థానం: నూతన పాలకమండలికి కొత్త సవాళ్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నేడు బాధ్యతలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్. నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, టీటీడీ ముందు చాలా సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు.
“రాబోయే పాలకమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాము” అని నాయుడు తెలిపారు. “తిరుమల పవిత్రతను కాపాడే విధంగా నిర్ణయాలు ఉంటాయి. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటాము” అని హామీ ఇచ్చారు.
శ్రీవాణి ట్రస్టు నిధుల దుర్వినియోగంపై కూడా నాయుడు స్పందించారు. “ప్రజల్లో శ్రీవాణి ట్రస్టు నుంచి నిధులు దారి మళ్ళాయనే అపోహ ఉంది. విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత ట్రస్టు కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటాము” అని వివరించారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన అధికారులను నాయుడు అభినందించారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. “అన్యమత ఉద్యోగుల కొనసాగింపుపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాము, సీఎం ఆదేశాలు మేరకు టీటీడీలో ఇప్పటికే ప్రక్షాళన మొదలైంది” అని వెల్లడించారు.
“ఆస్పత్రుల నిర్వహణ టీటీడీకి భారంగా మారింది” అని నాయుడు అన్నారు. అయితే, ఆస్పత్రుల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియలేదు.