తిరుపతికి కేంద్రపాలిత హోదా: సుప్రీంకోర్టులో పిటిషన్
తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ విషయాన్ని విచారించనుంది. తిరుమల దేవస్థానం నిర్వహణ పాలకమండలి చేతుల్లో కాకుండా పూజారుల చేతుల్లో ఉండాలని కేఏ పాల్ తన పిటిషన్లో కోరారు. దేవాలయాలలో రాజకీయ జోక్యం ఉండకూడదని కూడా ఆయన వాదించారు.
తిరుమల దేవస్థానానికి వచ్చే వేల కోట్ల ఆదాయం దుర్వినియోగం అవుతుందని పాల్ పిటిషన్లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, సీబీఐ, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చి ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాటికన్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించిన విషయాన్ని ఉదహరించి, లక్షలాది మంది భక్తులను కలిగి ఉన్న తిరుపతిని కూడా అలాగే చేయాలని కేఏ పాల్ పిటిషన్లో కోరారు.
100 రోజుల సంకీర్ణ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారని కేఏ పాల్ విమర్శించారు. జులైలో లభించే లడ్డూల నాణ్యతపై ల్యాబ్ రిపోర్టును సెప్టెంబర్‌లోనే ఎందుకు తెప్పించారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణ కూడా లడ్డూ వివాదానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కేఏ పాల్ వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. లడ్డూలలో ఎలాంటి కల్తీ లేదని, భక్తుల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. లడ్డూల గురించి తదుపరి చర్చలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తిరుమల లడ్డూల నాణ్యతపై తలెత్తిన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ అవసరమని కేఏ పాల్ గతంలోనే పేర్కొన్నారు.
జనాల ఆసక్తి కేఏ పాల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. లడ్డూ వివాదం, తిరుపతికి కేంద్ర పాలిత హోదా కల్పించే రెండింటిపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు.