ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్: నిజమేనా?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ ద్వారా సంభాషించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు ట్రంప్ సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ నుండి ట్రంప్ పుతిన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. దీనిపై రష్యా తాజాగా స్పందించింది. ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని, ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవమని రష్యా కొట్టిపారేసింది. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుండి ఒక ప్రకటన వెలువడింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్, ఒక్క రోజులో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని ప్రకటించారు. ఈ ప్రచారంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానని ట్రంప్ భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ మాట్లాడినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ సమాచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సోమవారం స్పస్టం చేశారు. రష్యా-యూఎస్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్‌కు పుతిన్ అభినందనలు తెలిపారు. ట్రంప్ ధైర్యవంతుడు అని, ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ సూచనను గతంలో క్రెమ్లిన్ స్వాగతించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *