వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో ఉదయం వాకింగ్ చేస్తున్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల హస్తం ఈ దాడి వెనుక ఉందని ఆరోపణలు వినిపిస్తుండగా, తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డితో తరచుగా ఫోన్ సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే, నరేందర్ రెడ్డిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. మరిన్ని వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తొలుత ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సోమవారం దుద్యాలలో గ్రామ సభ నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించేందుకు అధికారులు ప్రయత్నించారు.

దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్‌పై ప్రజాభిప్రాయం సేకరించేందుకు వచ్చిన కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు సహా పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కలెక్టర్‌పై దాడికి రెచ్చగొట్టిన ప్రధాన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేశ్ అని తెలిపారు. ఈ దాడి ముందు సురేశ్ పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో ఫోన్ సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. సురేశ్ మాట్లాడుతున్న సమయంలో, నరేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ అంశంపై డీజీపీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సురేశ్‌పై రేప్ కేసు సహా మరికొన్ని కేసులు ఇప్పటికే నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *