విశాఖ రుషికొండ ప్యాలెస్: అధికార దుర్వినియోగంపై చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత విలాసవంతమైన భవనాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రుషికొండ ప్యాలెస్‌ను ఇటీవల సందర్శించి వచ్చిన సీఎం, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను తన విలాసాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్రంగా విమర్శించారు.
ఒక కబోర్డు కోసం రూ. 60 లక్షలు ఖర్చు చేయడంపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనులకు వందల కోట్లు ఖర్చు చేశారని సీఎం వివరించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా, జగన్ కోసం నిర్మించిన ఈ భవనం రాజ భవనాన్ని తలపిస్తుందని చెప్పారు. “ఆయన బయటకు వెళ్లే మార్గాన్ని రాజమార్గంగా తీర్చిదిద్దారు. దాన్ని నిర్మించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు,” అని దుర్గేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
మెజారిటీ మంత్రులు సీఎంను, పేదలను, ఇల్లు లేని వారిని, పల్లెల రైతులను తీసుకొని వెళ్లి రుషికొండ ప్యాలెస్‌ను చూపించాలని కోరారు. “ప్యాలెస్‌ను అందరికీ చూపిస్తే బాగుంటుంది. జగన్ చేసిన అధికార దుర్వినియోగం అందరికీ తెలుస్తుంది. ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలందరికీ తెలుస్తుంది,” అని మంత్రులు అభిప్రాయపడ్డారు. “పేదల గురించి జగన్ బయటకు మాట్లాడతారని, కానీ ఆయన ప్యాలెస్లు నిర్మించుకుంటున్నారని” అని మంత్రులు మండిపడ్డారు.
మంత్రుల మాటలకు స్పందించిన చంద్రబాబు, త్వరలోనే రుషికొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. “రుషికొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై మంత్రులందరూ సలహాలు ఇవ్వాలని” అని సీఎం కోరారు.