వరంగల్‌లో రెవెన్యూ అధికారుల నిరసన!
వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు రెవెన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. నిన్న అభిప్రాయ సేకరణకు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు, గ్రామస్తుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. గ్రామస్తులు సహనం కోల్పోయి, కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారుల పై దాడి చేశారు.
దాడి తర్వాత రెవెన్యూ అధికారులు పరుగులు పెట్టారు. కానీ, కలెక్టర్ ప్రతీక్ జైన్ తో సహా అధికారులు కారెక్కిన గ్రామస్తులు వదిలిపెట్టలేదు. కార్ల పైన కూడా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారిపై కూడా దాడి జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులను చెదరగొట్టి, 28 మందిని అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
TGTA సంఘం నాయకులు ఎమ్మార్వోలు మహమ్మద్ ఇక్బాల్, విక్రమ్ కుమార్, బండి నాగేశ్వర్ రావు ఈ నిరసనలో పాల్గొంటున్నారు.