బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వర్ష సూచనలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చలి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వెచ్చని దుస్తులు ధరించడం, వేడివేడి ఆహారం తినడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.
అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, కావలి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు తమ పంట పొలాల్లో అదనపు నీటిని ఒడిసిపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.