వైసీపీ యాక్టివిస్ట్‌ అక్రమ అరెస్ట్‌!

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీందర్‌ రెడ్డిని కర్నూలు టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, కడపకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్‌, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్‌ పోలీసులకు ఆదేశించారు.

అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రవీందర్‌ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం కేసుకు సంబంధించిన పత్రాలను పీపీ, రవీందర్‌ రెడ్డి తరఫు లాయర్లు మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు వినగా, రవీందర్‌ రెడ్డిని రిమాండ్‌ చేయాలని మెజిస్ట్రేట్‌ నిర్ణయించారు.

వర్రా రవీందర్‌ రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయమూర్తికి వివరించారని ఆయన తరఫు లాయర్‌ ఓబుల్‌ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి కడపకు వస్తున్న సమయంలో కర్నూలు టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అరికాళ్లపై కొట్టి, తొడలపైకి ఎక్కి టార్చర్‌ చేశారని మెజిస్ట్రేట్‌కు వివరించారని చెప్పారు.

విజయమ్మపై వైయస్‌ షర్మిల, సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని టార్చర్‌ చేశారని లాయర్‌ పేర్కొన్నారు. అవినాష్‌ రెడ్డి పేరు చెప్పాలని టార్చర్‌ చేశారని, ఒప్పుకోకపోతే కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని హెచ్చరించారని మెజిస్ట్రేట్‌ ముందు రవీందర్‌ రెడ్డి చెప్పారని లాయర్‌ తెలిపారు. రవీందర్‌ రెడ్డి చెప్పిన విషయాలన్నీ మెజిస్ట్రేట్‌ రికార్డు చేశారని తెలిపారు. ఈ రోజు మెడికల్‌ టెస్ట్‌కు పంపించాలని మెజిస్ట్రేట్‌ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *